Wednesday 31 December 2014

సర్వవేదాంత సారం భగవద్గీత

మనిషి నడవాల్సిన రీతిని, చెయ్యవలసిన కర్మలని, ధర్మమార్గంలో నడిపే పద్ధతుల్ని, ధైర్యాన్ని నూరిపోసేదే భగవద్గీత. ఇది కేవలం కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదు. శ్రీకృష్ణ్భగవానుడు మానవాళినుద్దేశించి అర్జునుణ్ణి మిషగా పెట్టి చేసిన ప్రబోధం.
భగవంతుడు అందులో స్పృశించని విషయం లేదు. వేదాల, ఉపనిషత్తుల సారమంతా అందులో వుందని అన్నీ తెలిసిన పెద్దలు చెప్పగా వింటున్నాం. ఇది అనన్య సామాన్యమైన గ్రంథమని, ఇందులో లేని విషయం లేదని, అందరూ ఆరాధించవలసిన ఆచరించవలసిన విషయాలెన్నో ఇందు పొందుపరచి ఉన్నారని పెద్దల మాట.
నేటి మానవుడు ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించాడు. గగన వీధులలో విహరిస్తున్నాడు. గ్రహాలలోనూ కాలుమోపుతున్నాడు. సాగరపు లోతు, ఆకాశపు ఎత్తును కనుగొనడానికి ముందే ఉంటున్నాడు. ఇలా మొత్తం ప్రకృతిని కూడా జయంచాలని పోరాడుతునే ఉన్నాడు. మనుగడకోసం పోరాటం సల్పి విజయం సాధించిన వ్యక్తి మనసును గెలవలేకపోతున్నాడు. దాంతో గ్రహాలపై తిరిగినా, ఆకాశంలో పక్షికన్నా వేగంగా పరుగెత్తినా, నీటిలో చేపకన్నా త్వరగా ఈదగలిగినా కూడా మనిషి మనిషితనంతో బతకలేకపోతున్నాడు.
మనిషితనం అంటే మంచితనం, అనురాగం, అప్యాయత, ప్రేమ పంచలేని వ్యక్తి విచక్షణ ఉన్నా విచక్షణలేని మృగానికన్నా హీనంగా చరిస్తున్నాడు. ఇంద్రియాలపై జయకేతనం ఎగురవేయలేని వ్యక్తి దినదినాభివృద్ధి జరుగుతున్నట్లుగా కనిపించినా, అతనిలో రేకెత్తే వాంఛలు అథఃపాతాళానికి మనిషిని చేరుస్తునాయనిపిస్తుంది.
ఇవన్నీ పొడచూపకుండా ఉండాలంటే మనిషి మనసుపై విజయం సాధించాలి. దీనికి ధర్మాచరణ అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. నిరంతరం అభ్యాసం చేయాలి. దీనికి భగవద్గీత పఠనం ఎంతో మేలు చేస్తుంది. భగవద్గీత పఠనం అంటే తెలుసుకోవడమే కాదు అందులో చెప్పిన నీతిని ఆచరించాలి. యజ్ఞం, దానం, ధర్మం అంటూ ఏదేదో తెలిసి కొంత, తెలియదని కొంత కర్మలను ఆచరించడం, నిరంతరమూ ప్రతి కర్మా ధర్మయుక్తమైనదా కాదా అన్న ఆలోచనతో కాలయాపన చేయకుండా నిష్కామ బుద్ధితో అంటే చేసేవాడు, చేయంచేవాడు భగవానుడే తాను అనునది నిమిత్తమాత్రమే.
నేను, నాది, నాచే అని గాక ఈశ్వరార్పణబుద్ధితో పని చేయండి - పని అంటే కర్తవ్యాన్ని చేయండి ఫలితాన్ని ఆశించకండి. ప్రతి విషయాన్ని నాపై ఆరోపించి మీరు మీ పని చేయండి. మీ యోగక్షేమాలు నేను చూస్తాను. మీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో దాన్ని నేను ఇస్తాను. మీరు నిశ్చంతగా ఉండండి అని ఇసుమంత కష్టం లేకుండా భగవానుడు చెప్పిన రీతిలో నడుచుకుంటే చాలు మనందరమూ మానవులమే కాదు మాధవులం అయతీరుతాం. ఇక అపుడు మనసు, ఇంద్రియాలు జయ, అపజయ అన్న మాటలేవీ వినిపించవు. నేను అనేదే లేనప్పుడు ఇక జయాపజయాలుకాని వాదోపవాదాలు కానీ ఏవీ ఉండవు. తాము ఓ పరికరంగా కర్మ ఆచరిస్తే పాపపుణ్యాలు దరిచేరవు. లౌకికము, గాని అలౌకికం గాని ఏదీలేకుండా నిరంతరమూ ఆనందచిత్తంతో ఉంటారు. ఆనందమయుడైన పరమాత్మను నిత్యం స్మరిస్తూ ఉంటాం. శరీరం జీవించి ఉన్నా, లేకున్నా ఎల్లప్పటి ఉంటే ఆత్మ నిత్యసంతోషినే కదా.
ఏ ఉపనిషత్ అయనా, వేదం అయనా ఆ పర్మమాత్మ ఒక్కడే సత్యము. మిగిలినదంతా మిథ్య అనే కదా చెబుతున్నాయ. భగవద్గీతలో రాగద్వేషాలతో కొట్టుకొని పోయే అర్జునుణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణరూపంలో ఉన్న పరమాత్మ ఎవరు పుడ్తున్నారు, ఎవరు చస్తున్నారు, నేను చంపేయాల్సి వస్తోందే అనుకోవడం పొరపాటు అసలు నీవు ఎవరు అంటూ చేసిన హితబోధ సర్వ గ్రంథసారమే కదా. వేదసారమైనా అదేకదా. అందుకే అర్థం చేసుకుంటే భగవద్గీతనే సర్వవేదాంత సారం.

http://www.andhrabhoomi.net/content/b-417

No comments:

Post a Comment